ఏలూరు జిల్లాలో ‘అర్నబ్’ తుఫాన్ కారణంగా తగిన చర్యలు తీసుకోవాలి
1 min read
సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో ‘అర్నబ్’ తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టాలు కల్గకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం ‘అర్నబ్’ తుఫాన్ తీవ్రత, నష్టాలను నివారించేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని, ఎత్తైన హోర్డింగ్ లు తొలగించాలని,శిధిల భవనాలు,రేకుల షెడ్ల లలోని ప్రజలను తరలించాలన్నారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తం చేయాలన్నారు. నదులు, చెరువులు, కాలువలలోనికి ప్రజలు వెళ్లకుండా చూడాలని, వాటికి గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని, కల్వర్టులు, కాజ్ వే లు దాటాకుండా ప్రమాద హెచ్చరికలు, బారికేడ్లు ఏర్పాటుచేసి సిబ్బందిని నియమించాలన్నారు. వరద తీవ్రత పరిస్థితిపై గ్రామాలలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో 18002331077, 08812-224519 , 9491041419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా మండల స్థాయిలలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమస్యాత్మక మండలాల్లో తుఫాన్ పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. చెట్లు, స్తంభాలను తొలగించడం వంటి వరద సహాయక చర్యల నిమిత్తం క్రేన్లు, జేసీబీలతో ఆయా శాఖల అధికారులు మండలస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే విద్యుత్ కంట్రోల్ రూమ్ లు 9440902926, 9440904037, 9491030712, విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, విద్యుత్ సమస్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి అశోక్ కుమార్,, డిపిఓ మల్లికార్జునరావు, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో ఎస్ఈ లు జెడ్. రమేష్, విజయరత్నం, అంబేద్కర్ , స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్రబాబు,, స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డ్ సచివాలయాల జిల్లా అధికారి జి. వెంకటనాయుడు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఆర్టీఓ శేఖర్, ఎస్డీసీ దేవకీదేవి, మెప్మా పీడీ రాజబాబు, ప్రభృతులు పాల్గొన్నారు.


