స్వీయ గణనకు ‘ఒక్కరోజే’
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
మే 1 నుండి గృహ గణన సర్వే ప్రారంభం
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జనగణనలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ-స్వీయ గణన గురువారంతో ముగియనుందని, శుక్రవారం నుండి గృహ గణన సర్వే ప్రారంభమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వీయ జనగణనలో భాగంగా తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ పాల్గొంటే కచ్చితమైన, దోషరహిత సమాచారం లభిస్తుందని తెలిపారు.స్వీయ జనగణనకు గురువారం వరకు మాత్రమే అవకాశం ఉందని, ప్రజలు అధికారిక పోర్టల్ se.census.gov.in లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. నమోదు పూర్తయ్యాక 11 అంకెల ప్రత్యేక సంఖ్య (SEID) జనరేట్ అవుతుందని తెలిపారు. శుక్రవారం నుండి గృహ గణన సర్వే ప్రారంభమవుతుందని, ఆ సమయంలో ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు యస్ఈఐడి నెంబర్ ఇచ్చి సహకరించాలని కోరారు. ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జనగణన సిబ్బంది చరవాణి నంబర్ తప్ప ఇతర వివరాలు లేదా ఓటీపీలు అడగరని, వేలిముద్రలు లేదా ఐరిస్ సేకరించరని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 1855 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని కమిషనర్ తెలిపారు.

