అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘ సమీక్ష
1 min read
నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి అధ్యక్షతన సమీక్ష సమావేశం
జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం దెందులూరు నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. శాఖలు, మండలాలు వారీగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై సుదీర్ఘంగా సమీక్షించి, పెండింగులో ఉన్న పనులు నిర్ణీత సమయంలోగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్, రహదారులు, భవనాలు శాఖ ద్వారా మంజూరైన రోడ్లు, భవనాలు నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన సమయంలోగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, ఆర్ డబ్ల్యూఎస్, జలధార – జలహారతి కార్యక్రమాలు ద్వారా మంజూరు అయిన పనులు పూర్తిచెయ్యాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. పాఠశాలలు తెరిచేనాటికి త్రాగునీరు, టాయిలెట్లు, విద్యుత్తు రిపేర్లు, మౌళిక సదుపాయాలలోలోటుపాట్లు ఉంటే సరిచేసు కోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్లు, తదితర మౌళిక సదుపాయాలు పక్కాగా ఉండేలా చూడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన నిరుపేదలకు స్వంత ఇల్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తిచెసి గృహప్రవేశాలకు సిద్ధం చెయ్యాలని అన్నారు. ఇంటింటికీ వెళ్ళి పొడి, తడి చెత్తను సేకరించి రోడ్లపై చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రమం తప్పకుండా డ్రైన్లలో పూడిక తీసి మురుగునీరు పారేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి, గ్రామానికి చేరేలా అధికారులు ప్రత్యేక కృషి చెయ్యాలని అన్నారు.విద్యుత్తుశాఖ వారు చెట్టుతొలగించే కార్యక్రమాలు చేస్తున్నారని, స్థానిక తహశీల్దారు పర్మిషను లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు.ఎస్సీ, ఎస్టీ వారికి ఈ పథకాన్ని అమలు చెయ్యడంలో విద్యుత్తు శాఖ వెనుకబడి పోయిందని,అర్హులు అందరికీ ఈ పథకం అందేలా చూడాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్చి ఆర్డీవో యం.ముక్కంటి, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, దెందులూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి, జిల్లా డిఆర్డీఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా వివిధ శాఖలు అధికారులు, ఏయంసి చైర్ పర్సన్ గారపాటి రామసీత, దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు తహశీల్దార్లు,యంపిడివోలు, వివిధ శాఖలు మండల స్థాయి అధికారులు,నియోజకవర్గంలో నాయకులు,తదితరులు పాల్గొన్నారు.


