నీటి కోసం గ్రామం కలిసికట్టుగా…
1 min read
నంద్యాల జిల్లాలో ఆదర్శంగా నిలిచిన మల్యాల
పూడికతీతతో పునర్జీవం పొందిన కృష్ణయ్య కుంట
జలధార – జలహారతితో మల్యాల గ్రామానికి నీటి భరోసా
గ్రామస్థుల ఐక్యతతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఉపాధి హామీ పథకం ద్వారా కుంటకు కొత్త జీవం
పశువుల దాహార్తి తీర్చే జీవనాధారం మళ్లీ నిండుతోంది
నంద్యాల జిల్లా, నందికొట్కూరు: మండలం, మల్యాల గ్రామం… ఒక చిన్న గ్రామం. కానీ నీటి సంరక్షణలో పెద్ద సందేశాన్ని అందించినది. గ్రామంలోని కృష్ణయ్య కుంట – దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ నీటి వనరు, సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు, ముఖ్యంగా పశువులకు జీవనాధారంగా నిలిచింది. రోజూ 500 నుంచి 600 పశువులు ఈ కుంటలోని నీటితో దాహం తీర్చుకుంటూ వచ్చాయి. వేసవిలో నీటి కొరత ఎక్కువయ్యే సమయంలో కూడా ఈ కుంట గ్రామానికి ఆదారంగా నిలిచేది. అవసరమైనప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడి నుంచే నీటిని వినియోగించేవారు.అయితే, గత రెండు సంవత్సరాలుగా పూడిక తీయకపోవడంతో కుంటలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. పరిస్థితి మరింత దిగజారుతూ, కుంట పూర్తిగా ఎండిపోవడానికి చేరువైంది. గ్రామంలో నీటి సమస్య మళ్లీ తలెత్తే సూచనలు కనిపించాయి.ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారు తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలకు, పశువులకు ఉపయోగపడే ఈ కృష్ణయ్య కుంటను పునరుద్ధరించడం అత్యవసరమని గుర్తించిన ఆమె, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశాల మేరకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుని, కుంటలో పూడిక తీత పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.గత రెండు వారాలుగా మట్టి బుట్టలతో మోస్తూ, చెమటోడ్చుతూ పనిచేస్తున్న గ్రామస్థుల ఉత్సాహం చూస్తే ఇది కేవలం పని కాదు – తమ భవిష్యత్తు కోసం చేస్తున్న యజ్ఞంలా అనిపిస్తుంది. ప్రతిరోజూ సుమారు 100 నుంచి 120 మంది వరకు శ్రామికులు పనులకు హాజరై, ఎంతో నిబద్ధతతో కృషి చేస్తున్నారు. గ్రామస్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనుల్లో పాలుపంచుకుంటూ, తమ గ్రామానికి అవసరమైన నీటి వనరును కాపాడుకోవడంలో భాగస్వాములవుతున్నారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమం, గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.ఈ పనులకు రు. 4,17,541/- అంచనా వ్యయం కేటాయించబడింది. అలాగే KC కెనాల్ నుండి సిమెంట్ కాల్వ ద్వారా నీటిని ఈ కుంటకు మళ్లించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి, ఇది కుంటను మరింత స్థిరంగా నీటితో నింపే కీలక అంశంగా మారింది.జలధార – జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన ఈ చర్యలు ఇప్పటికే ఫలితాలను చూపించడం ప్రారంభించాయి. పూడిక తొలగింపుతో కుంటలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల భూగర్భ జలాలు పునరుద్ధరించబడుతూ, చుట్టుపక్కల బోర్లు, బావుల్లో నీటి మట్టం కూడా పెరుగుతుంది. ఈ మార్పుతో రైతులకు సాగునీటి భరోసా లభించడమే కాకుండా, గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా పశువులకు ఇకపై వేసవిలో నీటి ఇబ్బంది ఉండదనే నమ్మకం గ్రామస్థుల్లో పెరిగింది.మల్యాల గ్రామ ప్రజల ఐక్యత, కృషి, సంకల్పమే ఈ కుంటను మళ్లీ జీవంతో నింపుతోంది. “మన నీరు – మన భవిష్యత్తు” అనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ, మల్యాల గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న ప్రయత్నం… పెద్ద మార్పు… ఇదే మల్యాల విజయగాథ!


