శాస్త్రోక్తంగా శ్రీ మదనగోపాల స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట
1 min read
ముఖ్య అతిథులుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్,
రాధారాణి దంపతులు
అత్యంత వైభవంగా జరిగిన ప్రతిష్టాపన మహోత్సవాలు
నియోజకవర్గ ప్రజల సంక్షేమం, గ్రామాల సుభిక్షం కాంక్షిస్తూ యజ్ఞ క్రతువుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని దంపతులు
పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తిన దుగ్గిరాల,ఘనంగా అఖండ అన్న సమారాధన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో శనివారం ఉదయం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరియు వారి ధర్మపత్ని రాధారాణి సహకారంతో మరియు వారి ఆధ్వర్యంలో “శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెద్దన్నలా అండగా నిలిచి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని సాకారం చేశారు.స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి,శనివారం ఉదయం గం. 10:38 నిమిషాలకు శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న శుభ పుష్కరాంశము నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి వారి ఆలయ విమాన గోపుర, ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభ, ద్వారపాలక మరియు మూల మూర్తుల ప్రతిష్టాపన జరిగింది. వీటితో పాటు పరివార దేవతా ప్రతిష్టాపన, బలిపీఠం,యంత్ర స్థాపన, బింబ స్థాపన మరియు జీవకల వాహనం వంటి పవిత్ర క్రతువులను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన పూర్ణహుతి, గో దర్శనం, ప్రథమ అర్చన, శాంతి కళ్యాణం వంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా విరాజిల్లాలని కాంక్షిస్తూ వారు అగ్ని దేవునికి, యజ్ఞ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన వేద ఆశీర్వచనం, నీరాజన మంత్ర పుష్పాలు మరియు దీక్షా విసర్జన కార్యక్రమాలతో ప్రతిష్టాపన మహోత్సవం సంపూర్ణమైంది.మహోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి సైతం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా యాగ బ్రహ్మగా వ్యవహరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయాల రక్షణ మరియు ధర్మ పరిరక్షణే కూటమి ప్రభుత్వ ఆశయమని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బోప్పన సుధ,రిటైర్డ్ ఎస్పి నక్క సూర్యచంద్రరావు,గ్రామస్తులు బట్ర నాని, వడ్లపట్ల శ్రీనివాస్, చింతమనేని కృష్ణారావు, చింతమనేని శివగోపాల్,ఆలయ కార్యనిర్వాహక అధికారి ముదలవలస రాధ,కూటమి నాయకులు కమ్మ శివరామకృష్ణ, వేగుంట సురేష్ బాబు, దశరధ రామయ్య(పెరుగు గూడెం) సహా పలువురు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు,భక్తులు,భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


