ప్రతి ఒక్కరూ రోడ్డు భధ్రతా నియమాలు పాటించాలి
1 min read
డ్రైవింగ్ చేసే సయంలో ఫోన్ వాడవద్దు
హెల్మెట్,సీటుబెల్ట్ ధారణ, రహదారి భద్రత నియమాలపై అవగాహన కలిగించాలి
సెల్ ఫోన్ మాట్లాడుతూ,మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం
రహదారి ప్రమాదరహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించాలి
జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రహదారి భధ్రత మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భధ్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మాసం వరకు 240 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 113 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు 194 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 154 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎప్పటికప్పుడూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మూలంగా సత్ఫలితాలు వస్తున్నప్పటికీ వాహనాలు మితిమీరిన వేగంగా నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి ప్రమాదాలు నియంత్రణకు రహదారి భద్రత నియమాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలని, పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో భారీ వాహనాలు భద్రత ప్రమాణాలు కలిగి ఉన్నాయా, లేదా అని పరిశీలించాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని, ప్రమాదాలు నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ రోడ్డు భధ్రతా ఎన్ ఫోర్స్ లో భాగంగా పోలీస్ శాఖ ద్వారా గత జనవరి నుంచి మే 19వ తేదీ వరకు నిర్వహించిన నియంత్రణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 7551 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1415 మందిపై, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగిస్తున్న 653 మందిపై, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న 291 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న 185 మందిపై, బహిరంగంగా మద్యం సేవిస్తున్న 3731 మందిపై, రాంగ్ పార్కింగ్ చేసిన 2219 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో రవాణా శాఖ ఉప కమీషనర్ ఎస్.కె. కరీం, ఆర్అండ్ బి ఎస్ఈ కె. విజయరత్నం, జిల్లా ప్రజా రవాణాధికారి షేక్ షబ్నం, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.యు.శోభ, డిసిహెహ్ఎస్ డా.బి.పాల్ సతీష్ కుమార్, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ.భానుప్రతాప్, డిఎస్పీ డి.శ్రావణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ట్రాన్స్ ఫోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

