నిధులు కేటాయించకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అసాధ్యం
1 min read
చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలి
సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
స్పష్టమైన రాష్ట్ర జల విధానం రూపొందించాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి డిమాండ్
పల్లెవాణి, పశ్చిమగోదావరి: నిధులు కేటాయించకుండా వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖామంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించడం సరిపోదని, అందుకు అవసరమైన కార్యాచరణ ఉండాలన్నారు. మధ్యలో నిర్మాణం ఆగిపోయిన వెలిగొండ,చింతలపూడి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకుండా రూ.80 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని, గోదావరి- కావేరి అనుసంధానం చేస్తామని ఇలా గొప్పలు చెప్పడం ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్లుగా ఉందని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలలోని ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు,ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైన జిల్లాలకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం కొన్ని సూచనలు చేసిందని, రాష్ట్ర ప్రయోజనాలు,రైతాంగ ప్రయోజనాలు నష్టం జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా రైతు సంఘాలు, జల వనరుల నిపుణులు, రాజకీయపక్షాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన రాష్ట్ర జల విధానం రూపొందించాలని కోరారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలి.
చింతలపూడి ఎత్తి పోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చింతలపూడి ఎత్తిపోతలలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని, వారి భూములను రెవిన్యూ బ్లాక్ లిస్ట్ నుండి వెంటనే తొలగించాలని కోరారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేసి జిల్లాలోని ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల రైతాంగానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

