రెవిన్యూ సేవలలో నిర్లిప్తత ప్రదర్శించే అధికారులపై చర్యలు
1 min read
రెవిన్యూ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 శాతం ఉండాలి
తహసీల్దార్లు కార్యాలయంలో కూర్చోవడం కాదు,ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి
జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తా,పనితీరు మెరుగుపరచుకొని అధికారులను రివర్షన్ చేస్తా
ఏలూరులో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి రెవిన్యూ సేవలపై అధికారులతో సమీక్షించిన భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి.జయలక్ష్మి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రెవిన్యూ సేవలు ప్రజలకు అందించే విషయంలో నిర్లిప్తత ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, పిజిఆర్ఎస్ ,22 ఏ కేసుల పరిష్కారం,తదితర రెవిన్యూ అంశాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వితో కలిసి సిసిఎల్ఏ జయలక్ష్మి సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ భూ రికార్డులు స్వచ్చీకరణ రీ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని, రీ సర్వే లో ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించి ఎటువంటి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలన్నారు. ప్రజల 22ఏ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. జిల్లా పరిపాలనలో రెవిన్యూ శాఖది ప్రత్యేక స్థానమని, గ్రామ స్థాయి వరకు ప్రజలతో సుపరిచయమైన శాఖని, అటువంటి రెవిన్యూ శాఖ పనితీరుపై ప్రజలలో సానుకూల దృక్పధం పెంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అందించే సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా తెలుసుకుంటున్నదని, రెవిన్యూ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 శాతంగా ఉండాలని, ఈ సర్వే లో ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యంతో చివరి స్థానంలో నిలిచిన అధికారులు, సిబ్బంది చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏలూరు జిల్లాలో రెవిన్యూ సేవలలో ఐవిఆర్ఎస్ సర్వే లో ఏప్రిల్ నెల కన్నా, మే నెలలో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా నమోదైందని, తహసీల్దార్లు ఆఫీస్ లో కూర్చుని విధులు నిర్వర్తించడం కాదు… క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి.. ప్రజల సమస్యలపై అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వారితో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు.అధికారులు ప్రజలతో మమేకం అయితేనే అధికారులపట్ల సానుకూల దృక్పధం పెంపొందించుకుంటారన్నారు. రీ రీ సర్వే పనులను నిర్దేశించిన లక్ష్యాల మేర పూర్తిచేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న, రమణ, సర్వే శాఖ డిడి అన్సారీ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.


