NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆప్కాస్ ఉద్యోగులందర్నీ వెంటనే పర్మినెంట్ చేయాలి

1 min read

ఆప్కాస్ ఉద్యోగులకు 12వ పిఆర్సి ప్రకటించాలి

రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి

ఆప్కాస్ ఉద్యోగుల జిల్లా సదస్సు డిమాండ్

జిల్లా జేఏసీ చైర్మన్,జిల్లా ఎన్జీవో అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఆప్కాస్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 12వ పిఆర్సి ప్రకటించాలని,ఆప్కాస్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని నేడు ఏలూరులో జరిగిన ఆప్కాస్ ఉద్యోగుల జిల్లా సదస్సు డిమాండ్ చేసింది. ఆప్కాస్ ఉద్యోగుల జిల్లా సదస్సు నేడు ఏలూరు ఆర్.ఆర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో లావేటి కృష్ణారావు, రేలంగి నాగరాజు, టి.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో  జిల్లా జేఏసీ చైర్మన్, జిల్లా ఎన్జీవో అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను, ఆప్కాస్ ఉద్యోగులను ఎ.పి. హైకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేయబోయే ఆందోళనలకు ఏపీఎన్జీవోస్ సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు బి. సాల్మన్ రాజు మాట్లాడుతూ అప్కాస్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం శ్రమదోపిడి చేయడమేనని, ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేయడం దుర్మార్గమని హైకోర్టు పేర్కొన్నదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, వారికి చట్టబద్ధంగా రావలసిన జీతభత్యాలు అన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు. ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 70 వేలకు పైగా కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిందని, భవిష్యత్తులో ఆ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని ప్రకటించిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి, భవిష్యత్తులో ఈ బానిస వ్యవస్థ లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సదస్సులో ఏ.పీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. సోమయ్య మాట్లాడుతూ గత 20– 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆప్కాస్ ఉద్యోగులు స్కేలు లేక, డిఏ లేక, హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్లు, గ్రాట్యుటీ,పెన్షన్ తదితర సౌకర్యాలు లేక తక్కువ జీతాలతో వెట్టిచాకిరిలో మగ్గుతున్నారని అన్నారు. ఇవన్నీ సాధించుకోవడం కోసం , పర్మినెంట్ కోసం ఆప్కాస్ ఉద్యోగులు ఐకమత్యంతో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ సదస్సులో మున్సిపల్ ఇంజనీరింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కే, వెంకటరామయ్య, కె. సాంబశివరావు, ఏ.పీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏలూరు నగరనాయకులు జీ. వెంకటేశ్వరరావు@ బాలు, జంగారెడ్డిగూడెం నాయకులు కొత్తూరు శ్రీను, ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు తదితరులు పాల్గొని మాట్లాడారు.ఈ సదస్సు ఆప్కాస్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,12వ పిఆర్సి ప్రకటించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపుదల కోసం రానున్న కాలంలో దశల వారి ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. ఈ సదస్సులో మున్సిపల్ రంగం, ఆయిల్ ఫెడ్ రంగం, పిసిబి, పశుసంవర్ధక శాఖ, వైద్య శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *