ఆలూరులో తాగునీటి సంక్షోభంపై ఎమ్మెల్యే ఆందోళన
1 min read
ప్రజలకు కనీస తాగునీరు అందించలేని కూటమి ప్రభుత్వ వైఫల్యం
ఆలూరు ప్రజలకు నీరు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే హామీ
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో గత 16 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆలూరు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలతో కలిసి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలూరు వంటి నియోజకవర్గ కేంద్రంలోనే ప్రజలకు కనీస తాగునీరు అందించలేకపోవడం కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. తాగునీటి కోసం ప్రజలు రోజురోజుకూ అవస్థలు పడుతున్నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.రాష్ట్రంలో రెండేళ్లుగా కొనసాగుతున్న కూటమి పాలన ప్రజల ఆశలను పూర్తిగా వమ్ము చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో పాటు మొత్తం 143 హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటి అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా ప్రతి వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో ప్రతి రోజు మోసాలు, దగా, వివక్ష, కక్షసాధింపుల రాజకీయాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆలూరు ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం తాను నిరంతరం పోరాడుతానని, ప్రతి కుటుంబానికి తాగునీరు అందే వరకు తన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.ఆలూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

