ఉచిత ఎముకలు, కీళ్ల వైద్య శిబిరానికి విశేష స్పందన
1 min read
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి
విశాఖపట్నం, న్యూస్ నేడు: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం, క్రమమైన వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి సూచించారు. దువ్వాడ ఫేజ్–2లోని రాజీవ్ నగర్లో ఉన్న కుసుమ హరినాథ్ ఆశ్రమం సహకారంతో లీ ఫార్మా లిమిటెడ్, లీ హెల్త్ డొమైన్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తుల కోసం ఉచిత ఎముకలు, కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించగా, సుమారు 100 మంది భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పొందారు. శిబిరంలో భాగంగా ఆంత్రోపోమెట్రిక్ కొలతలు, హ్యాండ్ గ్రిప్ స్ట్రెంత్ (చేతి పట్టు బలం), బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), హిమోగ్లోబిన్ (హెచ్‌బీ), రాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్బీఎస్), రక్తపోటు (బీపీ), బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ తదితర పరీక్షలను నిర్వహించారు. అనంతరం వైద్యులు, పోషకాహార నిపుణులు పరీక్షల నివేదికలను పరిశీలించి, ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులపై వ్యక్తిగత కౌన్సెలింగ్ అందించారు. ఈ సందర్భంగా ఆళ్ళ లీలారాణి మాట్లాడుతూ, ఎముకలు, కీళ్ల దృఢత్వానికి నాణ్యమైన పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం అత్యంత అవసరమని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని లీ ఫార్మా లిమిటెడ్, లీ హెల్త్ డొమైన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తూ, అవసరమైన ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు, ఉచిత మందులను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని, జయలక్ష్మి, వైద్యురాలు డాక్టర్ రాధిక, పోషకాహార నిపుణులు మాధురి, క్రాంతి, భాగ్యలత, యోగా మాస్టర్ అఖిల్, లీ ఫార్మా సిబ్బంది, కుసుమ హరినాథ్ ఆశ్రమం అధ్యక్షుడు బి. బాబాజీ, రమేష్, శేఖర్‌తో పాటు ఆశ్రమ బృంద సభ్యులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.


