NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకం – శశికళ కృష్ణమోహన్

1 min read

జూలై 14 వరకు చివరి వారం రోజులు అత్యంత కీలకం

బీఎల్‌ఏలకు ఆర్థిక తోడ్పాటు అందించి ప్రోత్సహించాలి

ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా డిజిటలైజేషన్ అయ్యేలా అప్రమత్తంగా పనిచేయాలి

ఆలూరు న్యూస్ నేడు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ జూలై 14తో ముగియనున్న నేపథ్యంలో చివరి వారం రోజులు అత్యంత కీలకమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ బీఎల్‌ఏలు ప్రతిరోజూ బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ డిజిటలైజేషన్ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో పరిశీలించాలని సూచించారు. అలాగే ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, వారి వివరాలు పూర్తిగా నమోదు అయ్యేలా చూసి వాటిని సక్రమంగా అప్‌లోడ్ చేయించాలని కోరారు.బీఎల్‌ఏలుగా పనిచేస్తున్న వారు తమ రోజువారీ ఉపాధిని వదులుకుని పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, వారికి ఈ వారం రోజుల పాటు కనీస ఆర్థిక తోడ్పాటు అందించడం పార్టీ నాయకత్వం బాధ్యత అని ఆమె అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ సహాయం అందుతున్నప్పటికీ, అనేక చోట్ల బీఎల్‌ఏలకు సరైన ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ప్రాంతాల్లో పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించి బీఎల్‌ఏలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.రానున్న ప్రతి ఎన్నికలో బీఎల్‌ఏలే పార్టీకి కీలక బలమని, అందువల్ల ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ వారికి అన్ని విధాలా అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.చాలామంది ఓటర్లు కేవలం ఎన్యుమరేషన్ ఫారానికి ఆధార్ వంటి పత్రాలు జతచేసి బీఎల్‌ఓకు అందజేస్తే తమ పని పూర్తయిందని భావిస్తున్నారని, కానీ వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు.ప్రత్యర్థి పార్టీలు సరైన సమాచారం లేదనే కారణాలతో కొందరు ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ కాకుండా చేసే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని శశికళ కృష్ణమోహన్ కోరారు. ఓటర్ల హక్కులను పరిరక్షించే బాధ్యతను ప్రతి బీఎల్‌ఏ సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *