అర్హులు ఓటు కోల్పోకూడదు
1 min read
కర్నూలు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు
మొదటి రోజు ప్రత్యేక శిబిరాలకు విశేష స్పందన
143 పోలింగ్ కేంద్రాల్లో ఈఆర్వో సుడిగాలి పర్యటన
ఆదివారంతో ముగియనున్న ప్రత్యేక శిబిరాలు
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం ప్రతి అర్హుడికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరాలను ఆయన విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో 143 పోలింగ్ కేంద్రాలను సుడిగాలి పర్యటన చేసి శిబిరాల నిర్వహణ, ఓటర్ల స్పందన, ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటర్లకు అందిస్తున్న సేవలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ.. ప్రత్యేక శిబిరాలకు మొదటి రోజు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం అందని వారు, ఫారం అందినప్పటికీ ఇంకా సమర్పించని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. ఆదివారం సైతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు కొనసాగనున్నందున, ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు తమ సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారాలను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఆర్వో చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు.

