ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్యాపిలిలో అవగాహన ర్యాలీ
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్యాపిలి వైద్యాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాఘవేంద్ర గౌడు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు కుటుంబ నియంత్రణ, తల్లి-శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. దంపతులు ఇద్దరు పిల్లల మధ్య కనీసం 2–3 సంవత్సరాల విరామం పాటించాలని సూచించారు. ఇందుకోసం కండోమ్‌లు, ఓరల్ పిల్స్, కాపర్-టీ (PPIUCD/IUCD), అంతర ఇంజెక్షన్, అత్యవసర గర్భనిరోధక మాత్రలు (ఎమర్జెన్సీ పిల్స్) వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను వినియోగించాలని వివరించారు.కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం వల్ల అనుకోకుండా జరిగే గర్భధారణను నివారించడంతో పాటు తల్లి, శిశు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. గర్భధారణల మధ్య తగిన విరామం ఉండడం వల్ల ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు తగ్గి, తల్లి మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు తక్కువ బరువుతో లేదా నెలలు నిండక ముందే శిశువు జన్మించే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే శిశు మరణాలను కూడా తగ్గించవచ్చని వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్ సువర్ణ, ఏఎన్‌ఎం అరుణబాయి, అబ్దుల్లా, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

