వర్షాభావ పరిస్థితులలో ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించండి
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ప్రాంతంలో వర్షాభావంతో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులలో ఉపాధి హామీ కూలీలకు వెంటనే పని కల్పించడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు వై వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఈ కారణంగా వ్యవసాయ పనులు లేకపోవడంతో వేలాది మంది వ్యవసాయ కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉపాధి హామీ పనులు కల్పించాలని కూలీలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వి బి జి రాంజీ పథకం ప్రచారానికే పరిమితమైందే తప్ప, కూలీలకు తగిన పని కల్పించే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. పని కల్పించలేని సందర్భంలో కూలీలకు రోజుకు రూ.150 భృతి ఇస్తామని ప్రకటించినా, అది కూడా అమలు కావడం లేదన్నారు. వర్షాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినా పనులు దొరకని పరిస్థితి నెలకొందని, దీంతో కూలీల జీవనం మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వి బి జి రాంజీ పథకం కింద ఉపాధి హామీ కూలీలకు వెంటనే పనులు చేపట్టాలని, ఉపాధి హామీ పథకంలో పెండింగ్లో ఉన్న కూలీల బిల్లులను తక్షణమే చెల్లించాలని, పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మెడికల్ కిట్లను వెంటనే అందుబాటులో ఉంచి పంపిణీ చేయాలని కోరారు.


