వరల్డ్ షోగ్రెన్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి సంవత్సరం జూలై 23న నిర్వహించే వరల్డ్ షోగ్రెన్స్ డే (World Sjögren’s Day) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో షోగ్రెన్స్ సిండ్రోమ్ (Sjögren’s Syndrome) అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి లక్షణాలు, ముందస్తు గుర్తింపు, చికిత్స మరియు దీర్ఘకాలిక నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను వైద్యులను అడిగి నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ రుమటాలజిస్ట్ డా. సృజన గారు మాట్లాడుతూ, “షోగ్రెన్స్ సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా లాలాజల గ్రంథులు, కన్నీటి గ్రంథులపై దాడి చేసే ఆటోఇమ్యూన్ వ్యాధి. దీనివల్ల నోరు పొడిబారడం, కళ్లలో పొడిబారడం, కీళ్ల నొప్పులు, అలసట, కొన్నిసార్లు ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ సరైన సమయంలో రుమటాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు” అని తెలిపారు.అలాగే ఆమె మాట్లాడుతూ, “మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. కళ్లలో మంట, నోరు తరచుగా ఎండిపోవడం, నీరు తాగకపోతే మాట్లాడటం లేదా మింగడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు దీర్ఘకాలంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆధునిక వైద్య విధానాలతో రోగులు సాధారణ జీవనశైలిని కొనసాగించేలా చికిత్స అందించడం సాధ్యమవుతోంది” అని వివరించారు.కార్యక్రమంలో పాల్గొన్న రోగులు షోగ్రెన్స్ సిండ్రోమ్, ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు, కీళ్ల నొప్పులు, చికిత్స విధానాలపై పలు ప్రశ్నలు అడగగా, డా. సృజన వాటికి సమగ్రంగా సమాధానాలు అందిస్తూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం నేటి అవసరం. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స ప్రారంభిస్తే దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో అనుభవజ్ఞులైన రుమటాలజీ నిపుణుల ద్వారా అత్యాధునిక నిర్ధారణ, చికిత్స సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలని కోరుతున్నాము” అని తెలిపారు.


