అర్హులైన ప్రతి రైతు ని పంటల బీమా పథకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి
1 min read
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో అర్హులైన ప్రతి రైతు ని పంటల బీమా పథకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుపై వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తున్న వాతావరణ ఆధారిత పంటల భీమా పథకాలలో రైతుల నమోదు శాతం చాలా తక్కువగా ఉండడంతో అధికారులుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంటల భీమాలో ప్రతీ రైతుని సోమవారం లోగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, పునరవ్యవస్థికరించబదిన వాతావరణ ఆధారిత పంటల భీమా పధకాలపై పథకంపై రైతులకు విస్తృతమైన అవగాహన కలిగించి, అర్హత కలిగిన ప్రతీ రైతు నమోదయ్యేలా చూడాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులు నష్టపోకుండా ప్రతీ రైతు పంటల భీమా ప్రీమియం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకంలో పంటలు సాగుచేసే రైతులకు (బ్యాంకు లో రుణం పొందు రైతులు, రుణాలు పొందని రైతులు, సొంతభూమి మరియు కౌలుదారులు, రుణ అర్హత పొందిన గుర్తింపు కార్డు కలిగిన రైతులు) నమోదయ్యేలా చూడాలన్నారు. గడువు తేదీలోగా పంటల భీమా లో నమోదయ్యేలా చూడాలని, గడువు తేదీ అనంతరం పంటల బీమా నమోదుకు అవకాశం ఉండదని, అందువల్ల రైతులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే నమోదు చేసుకొని ఎల్నినో, ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు పథకం నిబంధనల ప్రకారం అర్హత కలిగిన నష్టాల నుంచి రైతులు ఆర్థిక రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులు, కౌలు రైతులు తప్పనిసరిగా పంటల భీమా పధకం ప్రీమియం చెల్లించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన అధికారి షాజా నాయక్, డిసిఓ ఆరిమిల్లి శ్రీనివాస్, ఎల్ డి ఎం, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


