ఒకే రోజు 1,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం
1 min read
49 వేల హెక్టార్ల నుంచి లక్ష హెక్టార్లకు ఉద్యాన పంటల విస్తరణ
రైతులకు మూడేళ్లపాటు ప్రభుత్వ అండ – స్థిరమైన ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: రైతులకు స్థిరమైన ఆదాయం, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో ఒకే రోజు 1,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విబిజి రాంజీ (VBG RAMG) పథకం కింద పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, వాటి విస్తీర్ణాన్ని లక్ష హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల వైపు అడుగులు వేయాలని సూచించారు. కొబ్బరి, నారింజ, మామిడి, జామ, సీతాఫలం, జీడిమామిడి వంటి సంప్రదాయ పండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో, అంజూర్, యాపిల్ వంటి అధిక ఆదాయాన్ని అందించే పంటలను ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. త్వరలో నంద్యాలలో పండించిన యాపిల్స్ కూడా మార్కెట్‌లోకి రానున్నాయని పేర్కొన్నారు.
తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు కలిపి సుమారు 30 రకాల విత్తనాలను చల్లే విధానాన్ని పాటించడం వల్ల నేలలో తేమ నిలిచి పంట దిగుబడి మెరుగుపడుతుందని తెలిపారు. వేసవి కాలంలో పశువుల నుంచి మొక్కలను రక్షిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో తోటలను సంరక్షించి ఉద్యాన సాగును లాభదాయకంగా మలుచుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులు, సాంకేతిక సహాయకులు, రైతులు, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.


