తల్లిపాల ప్రాముఖ్యతపై మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవం (World Breastfeeding Week)ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం, శిశువులకు జీవితంలో ఉత్తమమైన ప్రారంభాన్ని అందించడంలో తల్లిపాల పాత్రను తెలియజేయడం ఈ వారోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా డా. సింధూర రెడ్డి, నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషియన్, మాట్లాడుతూ, పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యం. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువుకు అవసరమైన పోషకాలు, వ్యాధినిరోధక శక్తి సహజంగానే లభిస్తాయి. తల్లిపాలు శిశువులో ఇన్‌ఫెక్షన్లు, విరేచనాలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని తెలిపారు.డా. అనూష, పీడియాట్రిషియన్, మాట్లాడుతూ, “తల్లిపాలు శిశువు శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధికి కూడా ఎంతో అవసరం. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాలను ఆపడానికి లేదా ప్రత్యామ్నాయ ఆహారం ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి” అని సూచించారు.కార్యక్రమంలో తల్లిపాలపై సమాజంలో ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ, ఉద్యోగినులు సహా ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించేలా కుటుంబ సభ్యులు సహకరించాలని వైద్యులు సూచించారు. తల్లిపాలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించవచ్చని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్స్, కర్నూల్ హాస్పిటల్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “తల్లిపాలు ప్రతి శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయడం మనందరి బాధ్యత. మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌లో గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలతో పాటు తల్లిపాలపై అవగాహన, లాక్టేషన్ కౌన్సెలింగ్ మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో అందిస్తున్నాము. ప్రతి తల్లి ఆత్మవిశ్వాసంతో బిడ్డకు తల్లిపాలు అందించేలా అవసరమైన మార్గదర్శకత్వం, సహాయాన్ని అందించేందుకు మా ఆసుపత్రి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది” అని తెలిపారు.


