రైతన్నా మీకోసం – ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక”పై అవగాహన
1 min read
హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో “రైతన్నా మీకోసం – ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక” పేరుతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర క్షేత్రస్థాయి ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఎల్‌నినో ప్రభావ నివారణకు సంబంధించిన శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన పొందారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి (ఏవో) ఆనంద్ లోక్ దళ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే ఎల్‌నినో పరిస్థితులను రైతులు ముందుగానే అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. నేలలో తేమను సంరక్షించే పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని, తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను అనుసరించాలని తెలిపారు.అదేవిధంగా రైతులు పంటలను తరచూ పరిశీలిస్తూ చీడపీడలు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, సమతుల్య ఎరువుల వినియోగం, సూక్ష్మపోషకాల అందజేత, నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా దిగుబడులను కాపాడుకోవచ్చని వివరించారు.ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పంటల బీమా, ఈ-క్రాప్ నమోదు, రైతు భరోసా కేంద్రాల సేవలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో రైతులు అడిగిన సందేహాలకు ఏవో ఆనంద్ లోక్ దళ్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. గ్రామస్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ఎల్లార్తి గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



