ఇండియన్ గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలి
1 min read
హోళగుంద తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హోళగుంద తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మారెప్ప, జెడ్పీటీసీ శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈషా, వైఎస్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె. గిరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగయ్య మాట్లాడుతూ.. హోళగుంద మండలంలో గత రెండు నెలలుగా ఇండియన్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఖాళీ సిలిండర్లను తీసుకుని రోజూ గ్యాస్ కోసం తిరుగుతున్నప్పటికీ సిలిండర్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.హోళగుంద మండలంలో మొత్తం 26 గ్రామాలు ఉన్నాయని, గత 25 సంవత్సరాలుగా ఇండియన్ గ్యాస్‌ను వినియోగిస్తున్న వేలాది కుటుంబాలకు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ పొందడం కష్టంగా మారిందన్నారు. ఖాళీ సిలిండర్లను తీసుకుని తేరుబజార్‌కు వెళ్లినా గ్యాస్ రాలేదని చెప్పి తిరిగి పంపిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. వంట గ్యాస్ కోసం ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, దీనివల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
హోళగుందలోనే గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి.
హోళగుంద మండల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని హోళగుందకు మార్చి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకపోతే హోళగుందలోనే ఇండియన్ గ్యాస్ నిల్వ గోదాం ఏర్పాటు చేసి మండలంలోని 26 గ్రామాలకు సకాలంలో సిలిండర్లను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలు వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సమస్యను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హోళగుంద మండలానికి ఇండియన్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కరించకపోతే ఆదోనిలో పెద్ద ఎత్తున ఆందోళన
ఇండియన్ గ్యాస్ సరఫరా సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే మండలంలోని ప్రజలను సమీకరించి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. ప్రజల ప్రాథమిక అవసరమైన వంట గ్యాస్‌ను సకాలంలో అందించడం అధికారుల బాధ్యత అని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.తహసీల్దార్‌కు అందజేసిన వినతిపత్రంలో హోళగుంద మండలానికి ఇండియన్ గ్యాస్ సరఫరాను పెంచడం, హోళగుందలో గ్యాస్ ఏజెన్సీ లేదా నిల్వ గోదాం ఏర్పాటు చేయడం, ఖాళీ సిలిండర్లు ఇచ్చిన వినియోగదారులకు సకాలంలో నిండిన సిలిండర్లు అందించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి కే. రంగన్న, నాయకులు వెంకన్న, హినహిత్, సలాం సాబ్, మస్తాన్‌వలి, వెంకటేష్, మహిళా నాయకులు, వామపక్ష నాయకులు, కార్యకర్తలు, గ్యాస్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.



