రజక ఈరమ్మ మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలి
1 min read
ఎమ్మార్వో, వీఆర్వో, సర్వేయర్‌లను సస్పెండ్ చేయాలి
ఈరమ్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి – హోళగుంద రజక సంఘం డిమాండ్
హోళగుంద న్యూస్ నేడు: గోనెగండ్ల గ్రామానికి చెందిన రజక మహిళ ఈరమ్మ మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని హోళగుంద గ్రామ రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈరమ్మ మృతికి దారితీసిన భూ వివాదం, భూ సర్వేలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.హోళగుంద గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, గోనెగండ్ల గ్రామానికి చెందిన రజక ఈరమ్మ 1962 సంవత్సరం నుంచి సంబంధిత భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోందని తెలిపారు. అయితే ఇటీవల చేపట్టిన భూ సర్వే ప్రక్రియలో ఈరమ్మ సాగు చేస్తున్న భూమిని గొల్ల సంజన్న కుమారుల పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదు చేశారని ఆరోపించారు.ఈ క్రమంలో ఈరమ్మ సాగు చేస్తున్న పొలంలోకి ట్రాక్టర్‌తో దున్నేందుకు వెళ్లగా, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఈరమ్మను అవమానకరమైన పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని రజక సంఘం నాయకులు ఆరోపించారు. ఆమె వద్దకు పురుగుల మందు డబ్బాను విసిరి, చావాలని బెదిరించినట్లు తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఈరమ్మ పురుగుల మందు సేవించిందని, అనంతరం ఐదు రోజులపాటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పేర్కొన్నారు.ఈరమ్మ మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా భూమి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మార్వో, వీఆర్వో, సర్వేయర్‌లను వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని కోరారు.ఇప్పటికే ఈ భూమికి సంబంధించి న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈరమ్మ సాగు చేస్తున్న భూమిని ఇతరుల పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదు చేశారని రజక సంఘం నాయకులు ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమికి సంబంధించి అధికారులు ఎలా ఆన్‌లైన్ నమోదు చేశారనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈరమ్మ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈరమ్మ సాగు చేసిన భూమిని తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. అలాగే ఈరమ్మ కుటుంబానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈరమ్మ మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయకపోతే, భూ వివాదంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రజక సంఘం నాయకులు హెచ్చరించారు. రజక మహిళకు జరిగిన అన్యాయంపై అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు స్పందించి ఈరమ్మ కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కురుకుంద నాగరాజు, శేకన్న, మంగయ్య, ఎల్‌ఐసీ లక్ష్మన్న, కరెంటు లక్ష్మన్న, క్లబ్ ఈరన్న, నాగేంద్ర, ఈరన్న, సీఐటీయూ నాగరాజు, ఎలక్ట్రిషన్ మల్లి, హనుమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


