ఉద్యానవనాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేలా ఉద్యానవనాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం ఆయన పరిమళ నగర్ ఉద్యానవనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని ఉద్యానవనాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పీపీపీ విధానంలో 37 పార్కులు, సాధారణ నిధులతో 8 పార్కులు, సీఎస్‌ఆర్ నిధులతో మరో 2 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సాధారణ నిధులతో మరో 14 పార్కుల్లో ఆధునికీకరణ పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు.ప్రజలకు మెరుగైన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందేలా పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఉద్యానవనాల అభివృద్ధి, నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు.అంతకుముందు సుంకేసుల రోడ్డులోని రాయల్ టవర్స్ వద్ద డ్రైనేజీ సమస్యను, గురు రాఘవేంద్ర నగర్‌లో తాగునీటి సమస్యను కమిషనర్ పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


