NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఐఆర్‌లో మరో కీలక దశ పూర్తి

1 min read

స్పెషల్ క్యాంపెయిన్ డే’లకు విశేష స్పందన

ఆగస్టు 29 నాటికి 10,608 దరఖాస్తుల స్వీకరణ

అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

కర్నూలు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు , న్యూస్​ నేడు :  భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణకు నిర్దేశించిన గడువు ఆగస్టు 30వ తేదీతో ముగిసిందని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’ కార్యక్రమాలను సి.క్యాంపు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ.. ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు, ఫాం 6, 6ఏ, 7, 8 ల స్వీకరణకు నిర్వహించిన ప్రత్యేక ప్రచార దినాలకు విశేష స్పందన లభించిందన్నారు. మే 19 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 10,608 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇందులో నమూనా–6 ద్వారా 4,653, నమూనా–6ఎ ద్వారా 108, నమూనా–7 ద్వారా 94, నమూనా–8 ద్వారా 5,773 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదుకు నమూనా–6, విదేశాల్లో నివసిస్తున్న భారతీయ ఓటర్ల నమోదుకు నమూనా–6ఎ, ఓటర్ల జాబితాలో పేరు చేర్పు లేదా తొలగింపుపై అభ్యంతరాలకు నమూనా–7, ఓటరు వివరాల సవరణ, నివాస మార్పు తదితర అంశాలకు నమూనా–8ను వినియోగిస్తారని వివరించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2,434 మందికి నోటీసులు జారీ చేశామని, విచారణ నిర్వహించి, అభ్యర్థనలు, అభ్యంతరాలను బీఎల్‌వోలు స్వీకరించారని ఎన్నికల నమోదు అధికారి తెలిపారు. తదుపరి దశలో అభ్యర్థనలు, అభ్యంతరాల పరిశీలన, విచారణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులో ఈ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3, 2026న ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

About Author