వినాయక నిమజ్జనానికి నీటి కొరత..
1 min read
ప్రజలు సహకరించాలి: మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు : ప్రస్తుతం కర్నూలులో నీటి పరిస్థితులు అనుకూలంగా లేనందున ఈ ఏడాది వినాయక నిమజ్జన కార్యక్రమాల విషయంలో ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. సుంకేసుల డ్యామ్ లో నీరు నిల్వ లేనందున కేసి కెనాల్ కు నీటిని విడుదల చేసే అవకాశం లేదన్నారు. వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి నివాసంలో మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు, వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, రెండు అడుగుల లోపు విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. చిన్న విగ్రహాలను ఇళ్ల వద్దనే నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే పెద్ద విగ్రహాలను తీసుకొచ్చిన వారు లేదా ఆర్డర్ ఇచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అలాంటి విగ్రహాలను ఒకచోట భద్రంగా ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, వచ్చే ఏడాది వాటితో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేలా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని అధికారులకు, ఉత్సవ కమిటీలకు సహకరించాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. త్రాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు.


