ఉద్యోగులకు తీపి కబురు: 12వ పీఆర్సీకి సీఎం గ్రీన్ సిగ్నల్
1 min read
ఉద్యోగుల డిమాండ్లపై సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయం
విజయవాడ , న్యూస్ నేడు: ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు తెలిపారు.చర్చల అనంతరం సీఎం తీసుకున్న నిర్ణయాల వివరాలను ఆయన వెల్లడించారు.12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం తెలిపారు.1-7-2024, 1-1-2025 తేదీలకు సంబంధించిన రెండు డీఏలను వచ్చే అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు .2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవులను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు.పోలీసులకు ఒక అదనపు సరెండర్ లీవును ఈ దసరాకు చెల్లించనున్నారు.70 ఏళ్లు పైబడిన పింఛనుదారులకు 10 శాతం, 75 ఏళ్లు పైబడిన వారికి 15 శాతం చొప్పున అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను 2027 జనవరి నుంచి వర్తింపజేయాలని నిర్ణయించారు.ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని క్రమబద్ధీకరిస్తూ, వచ్చే నెల నుంచి ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు జరపనున్నారు.ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ చైర్మన్ రవీంద్ర రాజు, సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వయంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, పరిష్కారానికి కృషి చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌లకు జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సూరిపల్లి రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాటకొండ శ్రీనివాస్, మిరియాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


