టీచర్లకు ఎస్టీయూ మండల శాఖ ఘన సన్మానం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్యాపిలి మండల ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సీనియర్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షులు జి. మద్దిలేటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్టీయూ సాంస్కృతిక వ్యవహారాల కమిటీ కో-కన్వీనర్ ఇ. వెంకట నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు.ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏనుగుమర్రి జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు సి. రామాంజినేయులు, ఎన్. రంగాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. రమేష్, చిన్నపూదిల్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యా, ఉపాధ్యాయ సంక్షేమం, గౌరవ గుర్తింపుల కోసం ఎస్టీయూ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి బి.వై. మద్దిలేటి మాట్లాడుతూ సన్మాన గ్రహీతలు విద్యార్థుల అభ్యున్నతితో పాటు ఉపాధ్యాయుల ఉన్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు.రామాంజినేయులు రూపొందించిన ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్, మధ్యాహ్న భోజనం, పే ఫిక్సేషన్ తదితర సాఫ్ట్వేర్లను రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు వినియోగిస్తున్నారని ప్రశంసించారు.కార్యక్రమంలో బి. చంద్రమౌళి, పవిత్రన్ రావు, సుదర్శన్ రెడ్డి, పరమేష్, యాస్మిన్, రజిత తదితరులు పాల్గొన్నారు.


