కర్నూలు స్పోర్ట్స్ హాస్టల్ సమస్యల సుడిగుండం
1 min read
తరలింపు గండం తప్పినా.. వసతి లేక క్రీడాకారుల అవస్థలు
హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌కు పబ్లిక్ గ్రీవెన్స్‌లో వినతి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులోని స్పోర్ట్స్ హాస్టల్ సమస్యలు క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. హాస్టల్‌ను తిరుపతికి తరలించే ప్రతిపాదనను అడ్డుకోవడంలో కే. నాగరత్నమయ్య, రుద్రారెడ్డి, సునీల్, రవి తదితరులు ముందుండి ఉద్యమం నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రి టి.జి. భరత్, జిల్లా అధికారుల చొరవతో చివరకు హాస్టల్ తరలింపు గండం తప్పిందని క్రీడాకారులు తెలిపారు.
కలెక్టర్‌కు వినతిపత్రం
సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పోర్ట్స్ హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించి, క్రీడాకారులకు వసతి, శిక్షణ సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఆరు నెలలుగా ఎదురుచూపులు
కర్నూలులోనే హాస్టల్ కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, సుమారు ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన భవనానికి మరమ్మతులు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదని వారు పేర్కొన్నారు. జూన్‌లోనే హాస్టల్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, అక్టోబర్ వచ్చినా ప్రారంభం కాకపోవడంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు గదులు, లాడ్జీలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కోచింగ్‌పైనా ఆందోళన
పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. హాస్టల్ అందుబాటులో లేకపోవడంతో కనీసం డే-బోర్డర్ క్రీడాకారులకైనా క్రమం తప్పకుండా కోచింగ్ అందించాలని కోరుతున్నారు. కోచ్‌లు విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ కొందరు క్రీడాకారులు, తల్లిదండ్రులు విమర్శలు వ్యక్తం చేశారు. క్రీడాకారుల శిక్షణకు అంతరాయం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేద తల్లిదండ్రులపై అదనపు భారం
ఈ హాస్టల్‌లో కర్నూలుతో పాటు నెల్లూరు, ఏలూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు కూడా ఉన్నారని తెలిపారు. హాస్టల్ అందుబాటులో లేకపోవడంతో పిల్లలను బయట ఉంచి కళాశాలలు, క్రీడా మైదానాలకు పంపించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వసతి, రవాణా ఖర్చులు భరించడం తమకు భారంగా మారిందని, కొందరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే హాస్టల్ ప్రారంభించాలని డిమాండ్
క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DSDO), సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని క్రీడా సంఘాలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్‌ను వెంటనే ప్రారంభించడంతో పాటు 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులకు తాత్కాలికంగా అవసరమైన వసతి, కోచింగ్ సదుపాయాలు కల్పించి వారి శిక్షణకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు.


