బడిశెట్టి శ్రీనివాసరావు,వందనాల దుర్గాభవానీ అత్యధిక మెజార్టీతో గెలిపించండి
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ప్రతీ డివిజన్‌లోనూ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది
సుడిగాలి పర్యటనలో ఎమ్మెల్యే చంటి, కూటమి మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరాభివృద్ధి మన బాధ్యత అంటూ ఎమ్మెల్యే బడేటి చంటి చేసిన పవర్ఫుల్ గర్జనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల రణం మరింత రంజుగా మారింది. గత వైసీపీ పాలకుల అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిళించేందుకూ, ఏలూరును మరింత అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించేందుకూ ప్రజల ముందు కార్పొరేషన్ ఎన్నికల అవకాశం ఉందని, ప్రజలు తమ ఓటుతోనే మంచికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చిన తీరుకు జనం చప్పట్లు, విజిల్స్, సంతోషాల కేరింతలతో మద్దతు పలికారు. ప్రతీ డివిజన్‌లోనూ కూటమి ప్రభంజనం సృష్టిస్తోందని, రికార్డు మెజారిటీలతో కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కూటమి అభ్యర్ధుల పక్షాన స్వయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా అంబరాన్ని తాకింది. తన మాస్ అప్పీల్‌తో పాటూ తన పదునైన మాటలతో ఆయన చేస్తోన్న ప్రచార హోరు ప్రత్యర్థి శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. ఏలూరు గడ్డపై కూటమి అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేననే విధంగా బడేటి చంటి సాగిస్తున్న ఈ ప్రచారయాత్రలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇదేక్రమంలో స్థానిక 55, 43 డివిజన్ల పరిధిలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సమావేశంలో కూటమి మేయర్ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి.ఏలూరును అభివృద్ధి చేసుకునేందుకు బాధ్యతాయుతంగా ముందుకు కదలాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విషయంలో కూటమికే ఎందుకు మద్దతుగా నిలవాలనే అంశంపై ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఎమ్మెల్యే బడేటి చంటి దాష్టికాలతో విధ్వంసాలు సృష్టించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోన్న వైసీపీ నేతల మాటలను వినిపించుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రతిస్పందించారు. తన గెలుపునకు బాసటగా నిలిచిన వారి విజయం కోసం తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని, తద్వారా మంచి టీమ్ ఏలూరు కార్పొరేషన్లో కొలువుదీరేలా చేసే బాధ్యతను ప్రజలతో పాటూ తాను కూడా స్వీకరించానంటూ ఆయన వ్యాఖ్యానించారు. కూటమి మేయర్ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధించిన ఓటుహక్కును సమాజానికి విద్రోహం కలిగించే వైసీపీకి కాకుండా అనునిత్యం ప్రజలకు మంచి చేయాలని భావించే కూటమి అభ్యర్ధులకు వేసి అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటి మేయర్ శిరిపల్లి ప్రసాద్, ఈడా మాజీ ఛైర్మన్ బొద్దాని శ్రీనివాస్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు వందనాల శ్రీనివాస్, 55వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధిని వందనాల దుర్గాభవానీ, 43వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధి బడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



