అయోడిన్‌తో ఆరోగ్యకరమైన జీవితం.. విద్యార్థులకు అవగాహన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: అయోడిన్ లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు సూచించారు. అధికారుల ఆదేశాల మేరకు ప్యాపిలి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు అయోడిన్ ప్రాముఖ్యత, దాని లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ఆయన అవగాహన కల్పించారు.అయోడిన్ థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే T3, T4 హార్మోన్ల ఉత్పత్తికి అవసరమని, ఇవి శరీర జీవక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాఘవేంద్ర గౌడు వివరించారు. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సముద్ర చేపలు, పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాల ద్వారా అయోడిన్ లభిస్తుందని తెలిపారు.ప్రస్తుతం అయోడిన్‌ను కలిపిన అయోడైజ్డ్ ఉప్పు అందుబాటులో ఉందని, వంటల్లో సాధారణ ఉప్పుకు బదులుగా అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తగినంత అయోడిన్ అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిల్లల్లో మెదడు అభివృద్ధి, మానసిక ఎదుగుదల, నేర్చుకునే సామర్థ్యాల పెంపునకు అయోడిన్ ఎంతో అవసరమని వివరించారు.అనంతరం విద్యార్థులకు అయోడిన్ ప్రాముఖ్యతపై క్విజ్ పోటీ నిర్వహించారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన రంగనాథ్, షరీఫ్‌లకు ప్రధానోపాధ్యాయురాలు పద్మాబాయి, ఉపాధ్యాయుడు శరత్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా వివిధ వ్యాధులు, వాటి నివారణ చర్యలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త లక్ష్మీదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



