NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు – కర్నూలులో సంయుక్త తనిఖీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: బియ్యం వ్యాపారులు అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు నగరంలోని హోల్‌సేల్ మరియు రిటైల్ కిరాణా వ్యాపార సంస్థలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ మరియు లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా లీగల్ మెట్రాలజీ నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు హోల్‌సేల్ బియ్యం విక్రయదారులపై ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున, మొత్తం రూ.75,000 జరిమానా విధించడం జరిగింది.అలాగే, సోనా మసూరి బియ్యాన్ని కిలో రూ.66కు మించి విక్రయించరాదని, ప్రతి విక్రయ కేంద్రంలో బియ్యం ధరలను స్పష్టంగా కనిపించే విధంగా ధరల పట్టిక (Rate Board) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని న్యాయమైన ధరలకు అందించడం, కృత్రిమ ధరల పెంపును అరికట్టడం, అధిక ధరలకు విక్రయించడం ద్వారా వినియోగదారులను దోపిడీ చేయకుండా నిరోధించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన ధరలను ఉల్లంఘించి బియ్యం విక్రయించినా, ధరల పట్టికను ప్రదర్శించకపోయినా, సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. వినియోగదారులు బియ్యం కొనుగోలు సమయంలో ధరలను పరిశీలించాలని, అధిక ధరలకు విక్రయించినట్లయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ సంయుక్త తనిఖీలలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్, కర్నూలు నగర సహాయ పౌరసరఫరాల అధికారి వెంకటరాజు, విజిలెన్స్ శాఖ అధికారి సిద్ధయ్య, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ రాముడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *