జనాభా గణనను ఖచ్చితత్వంతో నిర్వహించేలా సిబ్బందికి శిక్షణ
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జనాభా గణన అధికారులకుసూచన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జనాభా గణనను ఖచ్చితత్వంతో నిర్వహించేలా జనాభా గణన సిబ్బందికి పూర్తి అవగాహనతో శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జనాభా గణన అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో జనాభా గణనపై రాష్ట్ర జనాభా గణన శాఖ అధికారులు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభా గణన చాలా ప్రధానమైనదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమానికి అమలు చేసి సంక్షేమ పధకాల, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో జనాభా గణన ముఖ్యపాత్రను పోషిస్తాయన్నారు. దేశ జనాభాను అనుసరించి వివిధ పధకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం ద్వారా నిధులు కేటాయింపు చేస్తుందని, వివిధ పధకాల అమలు కూడా జనాభా సంఖ్యను అనుసరించి జరుగుతుందన్నారు. శిక్షణలో అందించే ప్రతీ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో వివరించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ప్రశ్నలను మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. జనగణన నిర్వహణపై మూడు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్నాధం, మాస్టర్ ట్రైనర్ కృష్ణ వేణి లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దుశ్శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, జిల్లాలోని జనగణనకు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లు, ప్రభృతులు పాల్గొన్నారు.



