‘పీఎం గతిశక్తి’ బృహత్తర ప్రణాళికకు పీఎం మోడీ నాంది!
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లీ: దేశ మౌలిక సదుపాయాల బృహత్తర ప్రణాళికకు పీఎం మోడీ ‘పీఎం గతిశక్తి’ కార్యక్రమానికి నాంది పలికారు. ఈమేరకు ఆయన దేశంలో మెడల్ కనెక్టివిటీ కోసం రూ.100లక్షల కోట్ల మాస్టర్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. 21వ శతాబ్దంలో దేశ అభివృద్ధి ప్రణాళికలకు ‘గతిశక్తి’గా మారుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా ఇది దోహదం చేస్తుందని చెప్పారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.
మౌలిక రంగంలో సమూల మార్పులు తీసుకరావడంతోపాటు శాఖల మధ్య సమన్వయంతో గతిశక్తి కార్యక్రమం చేపడతారు. 2024–25నాటికి సదరు గతిశక్తిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకెళుతోంది. భారత వ్యాపార రంగంలో పోటీ తత్వం పెంచడంతో పాటు టెక్స్‌టైల్, ఫార్మాసూటికల్ క్లస్టర్స్, డిఫెన్స్ కారిడార్, ఎలక్ట్రానిక్ పార్క్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫిషింగ్ క్లస్టర్స్, అగ్రి జోన్స్‌ను అనుసంధానం చేస్తారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెంచడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు గతి శక్తి ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు వలన ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా సాఫీగా సాగిపోతుంది. ఎక్కడా ఇబ్బందులు ఉండవు. చివరి మైలు వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తద్వారా ప్రయాణ సమయం తగ్గుతుంది.
మన దేశంలో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడి ఉంది. శాఖల మధ్య సమన్వయ లోపం లేకపోవడం ప్రధాన కారణం. రోడ్లభవానల శాఖ వారు ఏదైనా కొత్త రోడ్లు వేస్తే.. వాటిని విద్యుత్ లేదా ఇతర శాఖలకు చెందిన వారు తవ్వడం చూస్తేనే ఉన్నాం. అండర్ లైన్ విద్యుత్ కేబుల్స్ లేదా నీటి పైపుల కోసం కొత్తగా వేసిన రోడ్లను కూడా తవ్వుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐతే గతిశక్తితో ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. ఏ శాఖ ఏ పని ఎప్పుడు చేస్తుందో.. సమగ్ర వివరాలు పోర్టల్‌లో ఉంటాయి. అప్పుడు శాఖల మధ్య సమన్వయ లోపానికి అవకాశం ఉండదు.