మునగాలలో వ్యక్తి దారుణ హత్య
1 min readదర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
పల్లెవెలుగు వెబ్, గూడూరు: నిద్రిస్తున్న వ్యక్తిని.. మాట్లాడాలంటూ పిలిచిన దుండగులు.. దారుణంగా హత్య చేసిన ఘటన మునగాల గ్రామంలో చోటు చేసుకుంది. గూడురు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునగాలకు చెందిన బోయరోగన్న కుమారుడు బోయ ఆనకాల దస్తగిరి(55) తన ఇంట్లో నిద్రిస్తుండగా… ఆదివారం రాత్రి 10.30 గంటలకు మాట్లాడుదామని బయటకు పిలుచుకు పోయిన గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేసినట్లు మృతుడి తల్లి రామక్క బోరున విలపించింది.సమాచారం తెలుసుకున్న గూడూరు ఎస్సై నాగార్జున, కోడుమూరు సీఐ శ్రీధర్, ట్రైనీ ఎస్సై మమత హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడు బోయఅనాకళ్ళ దస్తగిరి కి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారని, అయితే వారు వదిలి పెట్టడం తో ప్రస్తుతం తన తల్లి రామక్క, తమ్ముడు భీమ రాముడితో కలిసి ఉన్నారన్నారు. మృతుడి తమ్ముడు భీమ రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోడుమూరు సీఐ శ్రీధర్, గూడూరు ఎస్ ఐ నాగార్జున మాట్లాడుతూ త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.