‘అంగన్వాడీ’ల సమస్యలను పరిష్కరించాలి
1 min read– ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంజుల
పల్లెవెలుగు వెబ్, మైదుకూరు: క్షేత్రస్థాయిలో అంగన్వవాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంజుల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మైదుకూరు మండలం లోని జీ.వి.సత్రం లో జీవి సత్రం సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. కేంద్రాల్లో నిర్వహించే కార్యకలాపాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్స్ సామర్థ్యం సరిపోవడం లేదని మొబైల్స్ ను మార్చాలని ప్రభుత్వ కార్యదర్శిని కోరినట్లు పేర్కొన్నారు. అంతేకాక కేంద్రాల్లో సరైన వసతులు లేవని, 55 ఏళ్ వరకు సూపర్వైజర్ పోస్టులు పొందేందుకు వెసలుబాటు కల్పించాలని కోరామన్నారు. అనంతరం సీపిఐ ఏరియా కార్యదర్శి పి. శ్రీరాములు మాట్లాడుతూ జీతాల పెంపు కోసం యూనియన్ పోరాడుతుందని , సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నందున అంగన్వాడీ కార్యకర్తలకు రోజుకు 710/-రూపాయల చొప్పున నెలకు 21,300 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తల సహాయకుల యూనియన్ మండల నాయకులు సంకులుగారిపల్లే లక్ష్మీదేవి, వరదాయ పల్లే లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.