సమస్యల అంతం పిడిఎఫ్ పంతం
1 min read– గెలుపు గుర్రాలకు పట్టం కట్టేలా పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి:
– కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు..
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: పశ్చిమ రాయలసీమ పరిధిలో శాసనమండలికి పిడిఎఫ్ తరుపున పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి లను మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు.శుక్రవారం గోనెగండ్ల మండల కేంద్రంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోరుతూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా వెనకబడ్డ రాయలసీమ సమస్యల పైన శాసనసభలో ఎలాంటి మాట కూడా మాట్లాడని రాజకీయ పార్టీలంతా శాసనమండలి ద్వారా కూడా ప్రజలను కొల్లగొట్టేందుకు మరొకసారి మన ముందుకు వస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలపైనే కాక ప్రజా సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు స్పందించి శాసనమండలిలో గట్టిగా పోట్లాడుతున్నది కేవలం పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని ఆయన తెలియజేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు నీళ్లే లేక వలసలు వెళ్లే రాయలసీమకు, తాగు నీళ్లు కూడా లేకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్రకు నిధులు కేటాయిస్తే, మాట కూడా మాట్లాడని రాష్ట్రంలోని పాలక, ప్రతి పక్షాలు ప్రజల ముందు ఓట్ల రాజకీయం చేస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులకు 194 సంఘాలతో పాటు కాంగ్రెస్, జనసేన పార్టీలు సైతం మద్దతు తెలిపారన్నారు. పిడిఎఫ్ అభ్యర్థులైన పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. పత్రిక విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు గానిగ భాష, మాలిక్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు దండు ఖాజా పాల్గొన్నారు.