‘మానసిక’ ఆరోగ్యం.. మానవ హక్కు..!
1 min read‘మానసిక’ ఇబ్బందిపై… అవగాహన ఉండాలి
– ఆశా కిరణ్ హాస్పిటల్ మానసిక వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సుహృత్ రెడ్డి
- నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం…
పల్లెవెలుగు: మానసిక ఆరోగ్యాన్ని విశ్వవ్యాప్త మానవ హక్కుగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు ఆశాకిరణ్ హాస్పిటల్ మానసిక వ్యాధి వైద్యనిపుణులు డా. సుహృత్ రెడ్డి. మంగళవారం (అక్టోబరు 10న) ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం నగరంలోని ఎన్ఆర్ పేటలోని ఆశాకిరణ్ హాస్పిటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మానసిక రుగ్మతతతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగు పరచడం… అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఆయన వివరించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ అవగాహన పెంచడానికి 1992 నుంచి ప్రతియేటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘ మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు’ అనే ఇతివృత్తంతో వ్యక్తులు, సంఘాలు ఏకం కావడానికి, ప్రజలందరికీ మానసిక ఆరోగ్యం అత్యున్నత ప్రమాణంగా పేర్కొనడానికి ఇదో అవకాశంగా ఉపయోగపడుతుందన్నారు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహనను వ్యాప్తిచేయడం, మానసిక ఆరోగ్య ప్రమాదాల నుంచి వ్యక్తులను రక్షించడంపై దృష్టి సారించాలన్నారు. మానవ శ్రేయస్సుకు మంచి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా డాక్టర్ సుహృత్ రెడ్డి అభివర్ణించారు.
పిల్లలపై…సెల్ఫోన్ ప్రభావం…:
ప్రస్తుత సమాజంలో పిల్లలు, యువత సెల్ఫోన్ల, కంప్యూటర్లకు అధిక సమయం కేటాయిస్తున్నారు. దీంతో మెదడు ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలో చదువుపై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. కోపం. క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. అధిక మానసిక ఒత్తిడికి లోనైన వారు… ఒకానొక దశలో ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ధ్యానం.. వ్యాయామం మరియు సరైన వైద్య సహాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు మెదడు చురుకుగా పని చేస్తుంది. మానసిక రోగులు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మానసిక రోగుల ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గమనిస్తూ… దగ్గరుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మానసిక వ్యాధి వైద్య నిపుణులు డా. సుహృత్ రెడ్డి సూచించారు.