వేసవిలో … జాగ్రత్తలు తీసుకోండి..
1 min read
వృద్ధులకు చెప్పులు, గొడుగులు అందజేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు,న్యూస్నేడు: ఈ ఏడాది వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు ఎండ వేడిమికి గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన శ్రీ గురుదత్త క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో ఎండల వేడిమికి గురి కాకుండా వృద్ధులకు ఆయన చెప్పులు, గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల పాటు కొనసాగే వేసవికాలంలో ఎండ వేడికి గురి కాకుండా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉదయం 11:00 లోపు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రతి ఒక్కరూ తమ పనులను కొనసాగించాలని, మిగతా సమయంలో నీడ ప్రాంతాల్లో ఉండడం మంచిదని తెలిపారు. వేసవికాలంలో ఆకాశంలో ఓజోన్ పొర దెబ్బ తినడం వలన అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయన్నారు. వేసవి ఎండల తీవ్రత హెచ్చరికల నేపథ్యంలో తన వంతు బాధ్యతగా ప్రజలకు అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూనే పేద వృద్ధులకు చెప్పులు, గొడుగులను పంపిణీ చేసినట్లు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ వెల్లడించారు.
