పారిశుద్ధ్య తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
1 min read
మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చెత్త చెదారం తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. గురువారం ఉదయం విజయవాడ ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎమ్ఈల సర్వే మరియు నియోజకవర్గాలలో ఎంఎస్ఎమ్ఈ పార్కు ల ఏర్పాటు, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి,జిల్లాధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చెత్త చెదారం తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని సిఎస్ కు నివేదించారు. గ్రామీణ/ మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో చెత్త చెదారం తొలగింపుకు ప్రత్యేక డ్రైవ్ తో చేపట్టడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త సంపద కేంద్రాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాలలో చెత్త సేకరణ పోగయ్యే ప్రదేశాలను గుర్తించి చెత్తాచెదారం తొలగింపునకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సీఎస్ కు నివేదించారు.వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 19న మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఈ మాసం లో “ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్”(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. జిల్లా అంతట పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని, తడి పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ వేస్ట్ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉంటుందని… దాని పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా త్రాగు నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను వనరుల ద్వారా పూర్తిగా నింపుకోవాలని సూచించారు. నీటి రవాణా అవసరమైన ప్రాంతాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు నీటి తొట్టెల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న 332 మండలాల్లోని 3వేల 438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్ల రూ.లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు,వేడి గాలులు వీచే అవకాశం ఉందని కావున వేడి గాలుల పరిస్థితులను అధికమించేందుకు తగిన సంసిద్ధత ముందు జాగ్రత్త కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలక్టర్లకు సిఎస్ సూచించారు. కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్రైవేట్ తాగునీటి వనరులను అద్దెప్రాతిపదిక తీసుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని ఆదేశించారు. అంతేగాక తాత్కాలిక నీటి సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ, మరమ్మత్తులు, తాగునీటి చెరువులను నీటితో నింపడం, చేతి పంపులకు మరమ్మత్తులు నిర్వహించడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్లను సూచించారు.