‘ అమాన ’ సంస్థ సేవలు అభినందనీయం
1 min read
–– మంత్రి టీజీ భరత్
-–– ఆ సంస్థ ద్వారా 25 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ
కర్నూలు:విదేశాల్లో ఉంటూ సొంత ఊరికి సేవ చేయాలన్న ఆలోచన రావడం ఎంతో ఆదర్శనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఉస్మానియా కాలేజీ రోడ్డులో ఉన్న టి.జి వెంకటేష్ మైనారిటీ షాదిఖానాలో అమాన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్.ఆర్.ఐ. ఫహాద్ ఏర్పాటుచేసిన స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి టి.జి భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 25 మంది బాగా చదివే పేద కుటుంబాలకు చెందిన ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చెక్కులు అందించారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ సొంతూరికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఫహాద్ ఆలోచన ఎంతో గొప్పదన్నారు. సేవ చేసే వాళ్ళను ప్రోత్సహించాలని ఆయన కోరారు. కొందరు వైసిపి నాయకులు ప్రజలకు సేవ చేయరు.. చేసే వాళ్ళని చూసి తట్టుకోలేరని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమం చేస్తున్న ఫహాద్ ఈ ప్రాంతంలో కట్టిన బ్యానర్లు వైసీపీ నేతలు చింపివేశారన్నారు. పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇది వైసిపి ప్రభుత్వం కాదన్నారు. కర్నూలును అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తాను ముందుకు వెళుతున్నానని.. మంచి పనులు చేస్తున్న తన మనుషులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనన్నారు. ఇక వక్ఫ్ బోర్డు బిల్లు గురించి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి చెప్పారు. ముస్లింలను ఇబ్బంది పెట్టే ఎలాంటి పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెయ్యబోరని అన్నారు. వైసీపీ నేతలకు పని లేక రాజకీయ లబ్ది కోసం ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని, కర్నూలును అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో కష్టపడుతున్నామని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలు అన్ని ఆలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, స్టేట్ హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ పరమేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి జహంగీర్ బాషా, సీనియర్ నాయకులు మెహబూబ్ ఖాన్, శేషు యాదవ్, మోహన్ రెడ్డి, హకీం, జనసేన నాయకులు పవన్, ఇతర నాయకులు, కార్యకర్తలు, టి.జి అభిమానులు పాల్గొన్నారు. అనంతరం అమాన స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ఫహాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. కర్నూలు అభివృద్ధి కోసం మంత్రి టి.జి భరత్ ఎంతో కష్టపడుతున్నట్లు ఫహాద్ చెప్పారు.
