గుంటూరులో కదంతొక్కిన కోకో రైతులు
1 min read
ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముట్టడించిన కోకో రైతులు
కోకో గింజలు ధరలు తగ్గించి వేయడంతో కోకో రైతులు ఆగ్రహం
కోకో గింజలు,కోకో కాయలతో కోకో రైతుల చలో గుంటూరు ధర్నా
అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలి
విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలి
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కోకో రైతులు కదం తొక్కారు. కోకో గింజలు, కోకో కాయలతో సోమవారం కోకో రైతుల చలో గుంటూరు “ధర్నా” నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హామీ ప్రకారం ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంతో ఆగ్రహించిన కోకో రైతులు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు శరణ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.ముందుగా చుట్టుగుంట సర్కిల్ వద్ద జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, బోళ్ల వెంకట సుబ్బారావు, ఉప్పుగంటి భాస్కరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గుది బండి వీరారెడ్డి,ఉప్పల కాశీ, కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ మాట్లాడారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు రోజు రోజుకీ ధర తగ్గించి వేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల మోసాలతో నష్టపోతూ తీవ్ర ఆందోళన,ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. ఈనెల 3న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో కోకో రైతుల సంఘం ప్రతినిధులు,కోకో రైతులు, ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, కోకో గింజలు కొనుగోలు కంపెనీలతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం జరిపారని గుర్తు చేశారు. కోకో రైతులకు న్యాయం జరుగుతుందని,వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈనెల 7న కోకో గింజల ధరల ఒప్పంద నిర్ణయ ప్రకటన వస్తుందని ఎదురు చూసామని,21 రోజులు గడిచినా ఇంతవరకు కోకో గింజల కొనుగోలు ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంతో అన్యాయమని విమర్శించారు. కంపెనీల మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు సీజన్, అన్ సీజన్ గింజలను 3:1 నిష్పత్తిలో కిలో కోకో గింజలకు రూ.550/-కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం మోండలీజ్ కంపెనీ కిలో గింజలకు రూ. 50/- తగ్గించారని, మిగిలిన కంపెనీలు కూడా ధర తగ్గించి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు దగ్గర నుండి గింజలు కొనుగోలు చేయడం లేదని,కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.750/- లకు పైగా ధర ఉందిని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అంతర్జాతీయ మార్కెట్ ధర కల్పించకపోతే కోకో రైతులు మరింతగా నష్టపోతారని అన్నారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని,మార్కెట్ మాయాజాలంతో మోసం చేస్తున్నాయని, కంపెనీల మోసాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కల్పించి, రైతులు వద్దనున్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టి కోకో రైతులకు న్యాయం చేయాలని కోరారు. విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని దేశీయంగా కోకో రైతులను ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో కోకో రైతుల పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.
డిమాండ్స్:
1) అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలి.
2) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజల ధరల ఒప్పంద నిర్ణయ ప్రకటన చేయాలి.
3) రైతులు వద్దనున్న కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి.
4) కోకో గింజల కొనుగోలు కంపెనీలు ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ధర ఇస్తూ మార్కెట్ మాయాజాలంతో రైతులను మోసగిస్తూ నష్టపరచడాన్ని అరికట్టాలి. అనంతరం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్యాన శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి కోకో రైతుల సంఘం ప్రతినిధులు, కోకో రైతులతో చర్చలు జరిపారు. వారం పది రోజుల్లో మరలా కంపెనీలతో సమావేశం నిర్వహించి ధరలు తగ్గకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కోకో రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, పి.సుధాకర్, పి. నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంచుమాటి అజయ్ కుమార్, ఏలూరు జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు తదితరులు మాట్లాడారు. చలో గుంటూరు కార్యక్రమానికి ఏలూరు,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు తరలివచ్చారు.
