బధిర బాలలకు ఉచితంగా అత్యాధునిక వినికిడి పరికరాలు
1 min read* వుయ్ హియర్ సంస్థ ఆధ్వర్యంలో అందజేత
* బోన్ కండక్షన్ విధానంలో పనిచేసే పరికరాలు
* వీటివల్ల మరింత మెరుగ్గా వినగలిగే అవకాశం
* ప్రభుత్వ బధిరుల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు వితరణ
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: సమాజంలో అందరికీ సమానావకాశాలు రావడం కష్టమని, కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం, ఆ అవకాశాలు కల్పించడం ముదావహమని జైన్ విద్యాసంస్థల సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మలక్‌పేటలోని ప్రభుత్వ బధిరుల పాఠశాలకు చెందిన ఐదుగురు పిల్లలకు వుయ్ హియర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అత్యాధునిక వినికిడి పరికరాలను ఉచితంగా అందించారు. సచివాలయం రోడ్డులోని సెంట్రల్ సెక్రటేరియట్లో గల ఎస్పీడీ కార్యాలయంలో ఈ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ముందుగా మలక్‌పేటలోని ప్రభుత్వ బధిరుల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేసి, అనంతరం వారిలో ఐదుగురిని గుర్తించి వారికి హియర్ ఎన్యూ అనే అత్యాధునిక వినికిడి పరికరాలను అందించారు. సాధారణ వినికిడి పరికరాలు ఎయిర్ కండక్షన్ ద్వారా పనిచేస్తే, ఇవి మాత్రం బోన్ కండక్షన్ ఆధారంగా పనిచేస్తాయి. ముంజేతికి తగిలించుకునే రిస్ట్ బ్యాండ్, తల మీదుగా చెవులకు తగిలించుకునే హెడ్ బ్యాండ్ అనే రెండు భాగాలుగా ఈ పరికరం ఉంటుంది. వాటిలో రిస్ట్ బ్యాండ్‌కు ఉండే మైక్రోఫోన్ అన్నిరకాల శబ్దాలను విని, బ్లూటూత్ ద్వారా హెడ్ బ్యాండ్‌కు పంపుతుంది. అవి బోన్ కండక్షన్ ద్వారా బధిరులకు వినిపిస్తాయి. ఈ అత్యాధునిక పరికరాలను వుయ్ హియర్ సంస్థ డైరెక్టర్ విజయ్ షా, ఆదేశ్ అగర్వాల్ పిల్లలకు అందించారు. భవిష్యత్తులో తెలంగాణలోని వివిద జిల్లాల్లో కూడా శిబిరాలు నిర్వహించి, బధిరులైన పిల్లలను గుర్తించి, నిధులు సేకరించి వారికి ఉచితంగా ఈ పరికరాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైన్ విద్యాసంస్థల సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కానీ అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. పిల్లలకు అవకాశాలు సరిగా అందట్లేదు. విజయ్ షా, ఆదేశ్ అగర్వాల్, అందరికీ అభినందనలు. ఈ పిల్లలకు అందిస్తున్న డొనేషన్‌తో వాళ్ల జీవితం మారుతుంది. అన్నీ విని, వాటికి స్పందించి, ప్రధాన స్రవంతి సమాజంలోకి వస్తారు. సమాజంగా మనమంతా ముందుకు రావాలి. హైదరాబాద్‌లో ఇప్పటికి మొత్తం 1,455 మంది పిల్లలను పరీక్షించారు. వాళ్లందరికీ పరికరాలు ఇవ్వాలంటే మనమంతా కూడా సాయం చేయాలి. ఐదుగురు పిల్లలకు వాళ్లే పరికరాలు ఇచ్చారు. ఇది మొదటి అడుగు మాత్రమే. తర్వాత స్పీచ్ థెరపీ చేయాలి. అప్పుడు పూర్తిగా మాటలు మాట్లాడగలరు” అని చెప్పారు.మలక్‌పేట ప్రభుత్వ బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి మాట్లాడుతూ, “మా స్కూల్లో 120 మంది పిల్లలున్నారు. వాళ్లను పరీక్షించారు. టెస్ట్ ట్రయల్ చేసినప్పుడు ఐదుగురిని గుర్తించారు. ఎయిర్ కండక్షన్ అంత బాగా పనిచేయడం లేదు. దానివల్ల లో ఫ్రీక్వెన్సీ శబ్దాలను మాత్రమే వినగలుగుతున్నారు. వీరు అందించిన బోన్ కండక్షన్ పరికరం చాలా బాగుంది. ఒక మాదిరి నుంచి తీవ్రమైన వినికిడి లోపాలకు ఇది బాగా పనికొస్తుంది. వెనక నుంచి వచ్చిన శబ్దాలను కూడా గుర్తిస్తున్నారు. వెనకనుంచి స్కూల్ బెల్ కొట్టినా, ఎన్ని గంటలు కొట్టారో కూడా చెబుతున్నారు. వీళ్లను సాధారణ ప్రజలతో కలిపేందుకు ప్రయత్నిస్తున్నాము. మా విద్యార్థులందరికీ వినికిడి పరికరాలు ఇవ్వడంతో పాటు, స్పీచ్ థెరపీ కూడా ఇప్పిస్తాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా మలక్‌పేట ప్రబుత్వ బధిరుల రెసిడెన్షియల్ స్కూలు ఆడియాలజిస్టు సంగీత, పాఠశాలకు చెందిన ప్రతిమ పాల్గొన్నారు. వినికిడి పరికరాలు పొందినవారిలో నాలుగో తరగతి విద్యార్థి రిషిక్, ఏడో తరగతి విద్యార్థి ఆర్. చందు, పదో తరగతి విద్యార్థులు మహ్మద్ జాఫర్, ఎం. తేజ, బి. కార్తీక్ ఉన్నారు.