రహదారి విస్తరణ బాధితులకు టిడిఆర్ బాండ్ల పంపిణీ
1 min read

తొలుత ముగ్గురికి అందజేసిన కమిషనర్ పి. విశ్వనాథ్
త్వరలో మరో 40 మందికి ఇస్తామని వెల్లడి
మిగిలిన ప్రభావితులు అభివృద్ధికి సహకరించాలి
కర్నూలు, న్యూస్ నేడు: ఆదివారం కర్నూలు నగర పరిధిలో ఎన్హెచ్ 340సి జాతీయ రహదారి విస్తరణలో స్థలం కోల్పోయే బాధితులకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టిడిఆర్) బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో స్థలం కోల్పోతున్న ముగ్గురు బాధితులకు టిడిఆర్ బాండ్లను అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… శ్రీ దామోదరం సంజీవయ్య సర్కిల్ నుండి ఎస్.ఎస్. గార్డెన్స్ వరకు ఎన్హెచ్ 340సి జాతీయ రహదారిని 100 అడుగులుగా వెడల్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మొత్తం 2.34 కి.మీ పొడవున ఈ విస్తరణలో 201 ఆస్తులు ప్రభావితమవగా, 178 ఆస్తులు పూర్తి ప్రభావితం అవుతున్నాయన్నారు. ఈ క్రమంలో తొలుత భూములు కోల్పోయిన ముగ్గురు బాధితులకు టిడిఆర్ బాండ్లు అందజేశామన్నారు. త్వరలో మరో 40 మందికి బాండ్లు అందిస్తామన్నారు. ప్రభావిత ఆస్తిదారులకు ఇప్పటికే 159 నోటీసులు జారీ చేయగా, 110 మంది సమ్మతిపత్రాలు ఇచ్చారన్నారు. రహదారి విస్తరణకు ప్రజలు ఇస్తున్న సహకారం అభినందనీయం అన్నారు. నగర భవిష్యత్ రవాణా సౌకర్యాలు మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో మేలు చేస్తుందని, మిగిలిన ప్రజలు కూడా సహకరించి నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, జాయింట్ కలెక్టర్ బి. నవ్య రహదారిని సందర్శించారని, గతంలో బాధితులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించినట్లు కమిషనర్ గుర్తుచేశారు.కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

