రవీంద్ర విద్యాసంస్థల్లో గురుపూజోత్సవ వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని రవీంద్ర విద్యా సంస్థల్లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య , అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , వైస్ చైర్మన్ జి. వంశీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో జి. పుల్లయ్య మాట్లాడుతూ ఆదర్శవంతమైన బోధనతో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికలతో ఉపాధ్యాయులు తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థుల మేదోమదనానికి కృషి సల్పూతూ భావి జీవితానికి బాటలు వేయాలన్నారు. భారతావని అభివృద్ధికి కంకణ బద్దులను చేయాలన్నారు. డాక్టర్ మమతా మోహన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో కూడా ఎంతో గొప్ప నైన మేధస్సు ఉందని,ఆ మేధస్సును సద్వినియోగపరిచేలా చేయగలడమే ఉపాధ్యాయుని ముఖ్య లక్షణమన్నారు. ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందించే విద్యార్థి వర్గాన్ని బయటకి తీసుకురావలసిన గురుతరబాధ్యత ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందన్నారు.జి. వంశీధర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక గొప్ప అణుక్షిపణిలాంటివారన్నారు. క్షిపణులను ఎప్పుడు ఎలా ప్రయోగించాలో నిపుణులకు మాత్రమే తెలుసని, అలాంటి నిపుణులైన ఉపాధ్యాయ వర్గానికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జి. నాగన్న, కే. గీతారాణి, ఏ. శిరీష,ఎం.లలితా కుమారి లను ఎంతో ఘనంగా సత్కరించడం జరిగినది.

