జీఎస్టీ సంస్కరణలు దేశ పురోగతికి ఊతమిస్తాయి..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ పురోగతికి ఊతమిస్తాయని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు ఆశాభావం వ్యక్తంచేశారు. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరింయలో ఈరోజు ఎన్ఎస్ఎస్ మరియు కామర్స్ విభాగంవారు నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధ్యతకలిగిన పౌరులుగా దేశంలో అమలవుతున్న వివిధ సంస్కరణలపట్ల విద్యార్థులు అవగాహన కలిగిఉండటం ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పనచేసిన అధ్యాపకులను ఆయన అభినందించారు. ఈనెల 16 వతేదీన కర్నూలులో దేశ ప్రధాని నరేంద్రమోడీ జీఎస్టీ 2.0 కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పేర్కొన్నారు. ప్రజలు రోజువారీ వినియోగించే వస్తువులపై పన్నులను తగ్గించడమన్నది దేశపురోగతికి సహకరిస్తుందని కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన నగరానికి చెందిన ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ ఇ. మోహన్ గౌడ్ వివరించారు. జీఎస్టీ ని అమలు చేయకముందరి పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులతో పోల్చిచూపుతూ ఆయన వివరించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు. గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీ ని రెంటు స్లాబులకే పరిమితం చేయడంద్వారా వర్తక వాణిజ్య వర్గాలకుకూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జీఎస్టీ కి సంబంధించి విద్యార్థులు అడిగిన వివిధ సందేహాలకు మోహన్ గౌడ్ సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో విజేతలకు వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు, రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కామర్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ మోజెస్, డాక్టర్ లీలాకుమారి, డాక్టర్ భారతి, డాక్టర్ యుగంధరుడు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడుతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

