NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్యవైశ్యులకు సముచిత స్థానం టిడిపి కల్పించింది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు:  రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో మౌర్య ఇన్ లో జరిగిన శ్రీ వాసవి మహిళా మండలి 35వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి, శ్రీ వాసవి మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు టీజీ రాజ్యలక్ష్మి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఆయన సతీమణి టీజీ శిల్పా భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా శ్రీ వాసవి మహిళా మండలి చక్కటి కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ సంస్థ ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలను రూపొందిస్తుందని వివరించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళలను మరింత చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి సంస్థల్లో ఉండటం వల్ల విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు నెట్వర్క్ పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నుంచి కర్నూలు పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. తాను పరిశ్రమల మంత్రిగా ఉండటం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇమేజ్ నేపథ్యంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ఓర్వకల్లు మండల పరిధిలో రిలయన్స్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాంటి ఎన్నో ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు. ఇటీవల 23 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుకు క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. కర్నూల్ ప్రాంతంలో రిలయన్స్ లాంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైంది అని తెలిపారు. దీంతోపాటు హైకోర్టు బెంచ్ ఏర్పాటును ఏ బి సి క్యాంపు స్థలాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే లభిస్తాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలంగా అధికారంలో ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన తెలిపారు .తాను పరిశ్రమల మంత్రిగా దేశంతో పాటు విదేశాల్లో పర్యటిస్తున్నానని, ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండడం లేదన్న భావనను ప్రజలు భావించవద్దని …కర్నూలు అభివృద్ధి చెందుతుందా… లేదా అన్నది అంతిమంగా ఆలోచించాలని ఆయన సూచించారు. ఈనెల 16వ తేదీ జరిగే ఆర్యవైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను, బలాన్ని చాటాలని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో దాదాపు 95 శాతం మంది ఆర్యవైశ్యులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు సముచిత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మంత్రివర్గంలో ఒక్క ఆర్యవైశ్యుడు కూడా లేడని ,కానీ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం లక్కీ డిప్ తీసి విజేతలకు బహుమతులను ముఖ్య అతిథులు అందజేశారు.

About Author