పత్తి కొనుగోలుకు సంబంధించి తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు
1 min read

లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం
12 కేసులు నమోదు, రూ.90 వేలు జరిమానా విధించాం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : రైతుల నుండి పత్తి కొనుగోలుకు సంబంధించి వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి హెచ్చరించారు.ఈ నెల 18 వ తేదీ నుండి 22 వ తేదీ లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, ఆదోని, కోసిగి తదితర మండలాల్లో ఉన్న పత్తి కమిషన్ ఏజెంట్లు, ట్రేడర్లు, వేజ్ బ్రిడ్జి లు, గిన్నింగ్ ప్రెస్ యూనిట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. కొందరు వ్యాపారస్తులు ఉపయోగిస్తున్న తూకపు యంత్రాలు రీ-వెరిఫికేషన్/స్టాంపింగ్ గడువు దాటినవని గుర్తించి, లీగల్ మెట్రాలజీ చట్టం, 2009లోని సెక్షన్ 8/25 మరియు 30 ప్రకారం 12 కేసులు నమోదు చేసి, సంబంధిత కేసులను చట్టప్రకారం కాంపౌండ్ చేసి రూ. 90 వేల జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వ్యాపారులందరూ వారు వాడే తూకపు యంత్రాలను కచ్చితంగా లీగల్ మెట్రాలజీ శాఖ వారిచే సరి చూసి, ముద్ర వేయించుకోవాలని, తదుపరి లీగల్ మెట్రాలజీ శాఖ వారిచే జారీ చేయబడ్డ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ను తమ వ్యాపార సముదాయములో ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు..అలాగే వినియోగదారులు కూడా తూకపు యంత్రాలపై లీగల్ మెట్రాలజీ శాఖ వారిచే ముద్ర వేయించుకున్నారా లేదా అని గమనించాలని సూచించారు. తూకాల్లో మోసాలు జరుగకుండా లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.


