క్రీడలు మనుషుల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తాయి
1 min read

మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: క్రీడలు మనుషుల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తాయని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక అవుట్డోర్ స్టేడియం నందు 44వ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ మీట్ అండ్ సెలక్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తనకు మొదటినుంచి క్రీడల పట్ల ఎంత ఆసక్తి ఉందని, అందుకే క్రీడల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గాను ప్రతి మండలంలో ఒక ఇంటర్ స్టేడియం నిర్మించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించడం జరిగిందన్నారు. అలాగే కర్నూలు నగరంలో ప్రతి వార్డులో ఒక మినీ ఇండోర్ స్టేడియం నిర్మించే దిశగా ప్రయత్నించి కమ్యూనిటీ హళ్ళ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియాలు అభివృద్ధి చేయకపోగా వాటన్నింటినీ ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చి వేయడం జరిగిందన్నారు. నగరంలోని వాకర్స్ కొరకు కేసి కెనాల్ పొడవునా, అలాగే తుంగభద్ర నది తీరాన వాకర్స్ ట్రాక్ నిర్మించినట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. అలాగే నగరంలో క్రీడల అభివృద్ధికి ఏపీఎస్పీ బెటాలియన్ లో అవుట్డోర్ స్టేడియం, పంచలింగాల గ్రామంలో, రాయలసీమ యూనివర్సిటీలలో ఇండోర్ స్టేడియాలను సొంత నిధులతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. తాను 50 సంవత్సరాల క్రితం కర్నూలుకు వచ్చినప్పుడు ఇప్పటి అవుట్ డోర్ స్టేడియం స్థలం కూడా చాలా ఆక్రమణకు గురి అవుతుండడంతో అప్పట్లోనే స్టేడియానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి స్టేడియం స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోగలిగామన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవగానే నగరంలో ఉన్న ప్రభుత్వ పార్కుల స్థలాలు గుర్తించి వాటికి ప్రహరీ గోడలు నిర్మించి దాదాపు 80 పార్కుల స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడ గలిగామని టీజీ తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ నందు పథకాలు సాధించిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి, డి ఎస్ డి ఓ భూపతి రావు, ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్, రామచంద్రారెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

