NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీల వేతనాలు పెంచాలి.. మా సమస్యలు పరిష్కరించాలి

1 min read

సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మహా ధర్నా

అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని,సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు.యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ధర్నాలో జిల్లా నలుమూలల నుండి వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు. ముందుగా ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుండి ప్రదర్శనగా ప్రారంభమై ఓవర్ బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కి చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. “ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్ గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని పెద్ద పెట్టున నినదించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు పి భారతి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్  లు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా అంగన్వాడీలకు ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యాసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు.యాప్ ల పేరుతో అంగన్వాడీలపై పని భారాన్ని పెంచారన్నారు. యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.గత సమ్మె కాలంలో కూటమి నేతలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మాట తప్పారని అన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను మినిట్స్ అమలు చేయాలని  డిమాండ్ చేశారు. మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ లుగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను సమీకరించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.యూనియన్ జిల్లా కార్యదర్శి టి. మాణిక్యం మాట్లాడుతూ అంగన్వాడీలకు మే నెల పూర్తిగా వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండవ శనివారం సెలవు ఇస్తామని కమిషనర్ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్ ఆర్ ఎస్ పేరుతో అంగన్వాడీల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలనికోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు జిల్లా నాయకులు ఎం.తులసి, టి.రజిని,షమీమా,భార్గవి, విమల, చెల్లమ్మ, పుష్ప,లత,బిజె ఎన్ కుమారి,సరళ,ఆదిలక్ష్మి, స్వర్ణకుమారి,సిఐటియు నాయకులు ఎం. ఇసాక్, వైయస్ కనకారావు, జి. రాజు, జి గోపి, జానుబాబు, కుమార్ తదితరులు నాయకత్వం వహించారు.

About Author