కోర్టు నిబంధనలను ఉల్లంఘించిన ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలి
1 min read

వారం రోజులుగా కొనసాగుతున్న న్యాయవాదుల నిరసనలు
పత్తికొండ,న్యూస్ నేడు: కోర్టు నిబంధనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా ముద్దాయిని బలవంతంగా బయటికి లాక్కెళ్ళిన చిప్పగిరి, పత్తికొండ ఎస్సైలపై రాష్ట్ర ప్రభుత్వం, హోం మంత్రి, డిజిపి చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాది ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల దగ్గర బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గత డిసెంబర్ 24వ తేదీన లొంగిపోయేందుకు కోర్టు లోపలకి వచ్చిన ముద్దాయి శివన్నను పత్తికొండ కోర్టులో నిబంధనలకు విరుద్ధంగా చిప్పగిరి ఎస్సై సతీష్ కుమార్, పత్తికొండ ఎస్సై విజయ్ కుమార్ లు కాలర్ పట్టుకుని లాకెళ్లడం జరిగిందని అన్నారు. ఈ విషయంపై పత్తికొండ డిఎస్పీ కి ఫిర్యాదు చేసిన ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. న్యాయస్థానాన్ని అవమానించిన ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా కాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా న్యాయవాదులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారని వివరించారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, హోం మంత్రి, డిజిపి కానీ ఇంతవరకు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. న్యాయస్థానాన్ని అవమానించిన ఎస్సై లపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలను ఇలాగే కొనసాగించి ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నారాయణస్వామి, సురేంద్ర, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ మహేష్, రవి, ఇలియాజ్, సుధాకృష్ణ, వాసదేవ, నెట్టేకల్లు, కబీర్, వీరేష్, రంగన్న, రాజాక్, సాంబ తదితరులు పాల్గొన్నారు.

